భారత రాష్ట్ర సమితి (BRS) సీనియర్ నాయకుడు, వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (51) అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో ముగిశాయి. తన ఆప్తమిత్రుడు, సుదీర్ఘ కాలం పాటు కలిసి నడిచిన ఉద్యమ సహచరుడి భౌతికకాయాన్ని చూసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత తన్నీరు హరీశ్ రావు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అంతిమయాత్రలో సుదర్శన్ రెడ్డి పాడె మోస్తూ హరీశ్ రావు కన్నీటిపర్యంతమవగా, బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు, వేలాది మంది అభిమానులు దివంగత నేతకు అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు.
గత కొన్ని రోజులుగా గుండెపోటు సమస్యతో బాధపడుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం రాత్రి సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జూలై 26న హనుమకొండలోని తన నివాసంలో తీవ్రమైన ఛాతి నొప్పితో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఆయనకు, వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా, అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
సుదర్శన్ రెడ్డి భౌతికకాయాన్ని తొలుత హనుమకొండకు తీసుకువచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచిన అనంతరం, నర్సంపేట మీదుగా ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. 2001లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి గులాబీ జెండా పట్టి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఆయన కొనసాగారు. సుదర్శన్ రెడ్డి అకాల మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మన్యం ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసిన ఒక నిఖార్సైన ఉద్యమ సహచరుడిని, ఆత్మీయుడిని కోల్పోవడం పార్టీకి, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.









