భద్రాచలం జ్యుడీషియల్ కోర్టును సందర్శించిన జిల్లా & సెషన్స్ జడ్జి శ్రీమతి జి. ప్రేమలత..
భద్రాచలం… ఆగస్ట్ : 1
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా & సెషన్స్ జడ్జి శ్రీమతి జి. ప్రేమలత శనివారం భద్రాచలంలో అధికారిక పర్యటన నిర్వహించారు. పర్యటనలో భాగంగా ముందుగా భద్రాచలం జ్యుడీషియల్ కోర్టును సందర్శించి కోర్టు ఆవరణ, న్యాయస్థానాల పనితీరు, మౌలిక సదుపాయాలు, వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం న్యాయాధికారులు,
భద్రాచలం బార్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమై కోర్టు నిర్వహణ, మౌలిక వసతులు, న్యాయవాదుల అభిప్రాయాలు, కోర్టు అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి కోర్టుకు వచ్చే న్యాయవాదులు, కక్షిదారుల సౌకర్యార్థం కోర్టు ఆవరణలో క్యాంటీన్ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని జిల్లా జడ్జి దృష్టికి తీసుకువెళ్లారు.
అందుకు ప్రస్తుతం ఉన్న షెడ్‌ను పరిశీలించాలని కోరగా, జిల్లా జడ్జి ఆ షెడ్‌ను స్వయంగా సందర్శించి పరిశీలించారు. అలాగే కోర్టులో అవసరమైన సిబ్బంది సంఖ్యను పెంచాలని, భద్రాచలంలో పెరుగుతున్న కేసుల భారాన్ని దృష్టిలో ఉంచుకొని అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దీనిపై జిల్లా జడ్జి శ్రీమతి జి. ప్రేమలత సానుకూలంగా స్పందిస్తూ, ఈ అంశాలను గౌరవ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అనంతరం జిల్లా జడ్జి భద్రాచలం స్పెషల్ సబ్- జైలును సందర్శించి అక్కడి పరిపాలన, ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలు, మౌలిక, భోజనం వసతులను, ఉచిత న్యాయ సహాయాన్ని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. జైల్లోని ఖైదీలు అగరబత్తి తయారీ విధానాన్ని కొనియాడారు.
అనంతరం మానవసేవ వాలంటరీ ఆర్గనైజేషన్ వారి ఓల్డ్ ఏజ్ హోమ్‌ను సందర్శించి అక్కడ నివసిస్తున్న వృద్ధులను పలకరించి, వారికి పండ్ల రసాన్ని అందించారు, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు, వృద్ధాశ్రమలో అందిస్తున్న సేవలను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు.
ఈ పర్యటనలో భద్రాచలం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివ నాయక్, భద్రాచలం అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దుర్గా భవాని, భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసాచారి, జాయింట్ సెక్రెటరీ తాత లలిత, లేడీస్ రిప్రజెంటిటివ్ తరుణి, హైకోర్టు న్యాయవాది పీవీ కృష్ణమాచారి, సీనియర్ న్యాయవాదులు కే శ్రీమన్నారాయణ, చుక్క నాగ అంబేద్కర్, పేరాల వెంకటేశ్వర్లు, పేరాల నాగరాజు, బండారు అరుణ్ చంద్, పామరాజు తిరుమలరావు, అవులూరి సత్యనారాయణ, కె అరుణ శ్రీ, సాధన పల్లి సతీష్, వై వినిలా రాణి, బండారు రమేష్, దండమూడి శ్రీనివాస్, విద్యాధరి, ఎం సంధ్యారాణి, దండమూడి హర్షిని, శ్రీనివాస్, చందన తదితర న్యాయవాదులు కోర్టు స్టాప్ పాల్గొన్నారు.









