ఫన్ పేరుతో ర్యాగింగ్ చేస్తే జైలు బాటే..

  • ఫన్ పేరుతో ర్యాగింగ్ చేస్తే జైలు బాటే..
  • ర్యాగింగ్, డ్రగ్స్, బాల్యవివాహాలకు దూరంగా ఉండాలి…
  •  సీనియర్లు భయపెట్టొద్దు.. జూనియర్లకు అండగా నిలవండి..

మణుగూరు జేఎంఎఫ్‌సీ మెజిస్ట్రేట్ కంబపు సూరిరెడ్డి..

Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు

ఫన్ పేరుతో చేసే ర్యాగింగ్ సరదా కాదని, అది చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ (ఎంఎల్‌ఎస్‌ఏ) చైర్మన్ కంబపు సూరిరెడ్డి అన్నారు.

మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు పరిధిలోని మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలనే ఉద్దేశంతోనే ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ర్యాగింగ్ అనేది కేవలం సరదా కోసం చేసే చర్య కాదని, ఎదుటివారిని మానసికంగా, శారీరకంగా బాధించే చర్య అని, అందువల్ల అది చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందని స్పష్టం చేశారు. తల్లిదండ్రుల సంరక్షణ, పాఠశాల ఉపాధ్యాయుల పర్యవేక్షణ నుంచి తొలిసారిగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కళాశాల జీవితంలోకి అడుగుపెట్టే విద్యార్థులు ఒక్కసారిగా స్వేచ్ఛ లభించిన భావనకు లోనవుతారని అన్నారు. ఆ వయస్సులో పూర్తిస్థాయి మానసిక పరిపక్వత ఉండదని, భావోద్వేగాలకు, స్నేహితుల ప్రభావానికి సులభంగా లోనై తాము చేస్తున్నది తప్పు అనే అవగాహన లేకుండానే నేరాలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. క్షణికావేశంలో తీసుకునే ఒక తప్పు నిర్ణయం జీవితాంతం బంగారు భవిష్యత్తును దెబ్బతీస్తుందని హెచ్చరించారు. ప్రతి సీనియర్ విద్యార్థి తాను కూడా ఒకప్పుడు జూనియర్‌గా కళాశాలలో అడుగుపెట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. జూనియర్లను భయపెట్టడం, అవమానించడం లాంటి చర్యలకు పాల్పడకుండా వారికి సోదరులు, సోదరీమణుల్లా అండగా నిలిచి మార్గనిర్దేశనం చేయాలని కోరారు. గౌరవం అనేది బెదిరించి లేదా భయపెట్టి పొందేది కాదని, మంచి వ్యక్తిత్వం, సత్ప్రవర్తనతో సంపాదించుకునేదేనని విద్యార్థులకు హితవు పలికారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన హక్కులతో పాటు ప్రాథమిక విధులను కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు, వాటి వినియోగం లేదా విక్రయాల గురించి సమాచారం తెలిసిన వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌కు లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని కోరారు. అలాగే బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, అలాంటి ఘటనలు తెలిసిన వెంటనే సంబంధిత శాఖలకు సమాచారం అందించాలని సూచించారు. ర్యాగింగ్, మాదకద్రవ్యాలు, బాల్యవివాహాలకు పాల్పడినా, వాటికి సహకరించినా క్రిమినల్ కేసుల్లో చిక్కుకుని భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ సందర్భంగా మణుగూరు సీఐ పాటి నాగబాబు, బార్ అసోసియేషన్ న్యాయవాదులు మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థి దశలోని బాధ్యతలను గుర్తించి క్రమశిక్షణతో ముందుకు సాగాలని సూచించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ‘బీ పాజిటివ్’ దృక్పథంతో కృషి చేయాలని, చట్టాలను గౌరవించే ఆదర్శ పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురు కృష్ణ, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వీరంకి పద్మావతి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యప్రకాశ్, న్యాయవాదులు కందిమల్ల నరసింహారావు, విజయ్, సావిత్రి, అంకం సర్వేశ్వరరావు, పోషం భాస్కర్, వాసవి, అధ్యాపకులు ఎం.డి. ఖుర్షీద్, నస్రీన్ కౌసర్, గీత, ఎంఎల్‌ఎస్‌ఏ కోఆర్డినేటర్ రవీందర్, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు .

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు