మధ్యప్రదేశ్‌లోని కైలారస్‌లో ఒక విచిత్రమైన, సంచలన ఘటన వెలుగు చూసింది. తీవ్రమైన ఎండ వేడికి తట్టుకోలేక లలిత అనే ఉపాధ్యాయురాలు తన స్కూటర్ పైనుంచి అకస్మాత్తుగా కింద పడిపోయారు. అది గమనించిన ఇద్దరు స్థానిక యువకులు ఆమెకు గుండెపోటు (హార్ట్ ఎటాక్) వచ్చిందని పొరబడ్డారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె ప్రాణాలు కాపాడాలనే తొందరలో, అక్కడికక్కడే ఆమెకు అత్యవసరంగా సీపీఆర్ (CPR) చేయడం ప్రారంభించారు.
అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు జరిపిన పరీక్షల్లో అసలు నిజం బయటపడింది. ఆమెకు ఎలాంటి గుండెపోటు రాలేదని, కేవలం ఎండ దెబ్బ (లూర్) కారణంగానే స్పృహ తప్పి పడిపోయారని వైద్యులు తేల్చారు. అయితే, అవగాహన లోపంతో ఆ యువకులు తీవ్రమైన ఒత్తిడితో సీపీఆర్ చేయడము వల్ల సదరు మహిళకు రెండు పక్కటెముకలు విరిగిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. యువకులు పొరపాటు చేసినప్పటికీ, ఒకరి ప్రాణాన్ని కాపాడాలనే మంచి ఉద్దేశంతోనే స్పందించారని, ఎముకలు విరిగితే కాలక్రమేణా అతుక్కుంటాయి కానీ ప్రాణం పోతే తిరిగి రాదంటూ నెటిజన్లు వారి ఆరాటాన్ని సమర్థిస్తున్నారు. అదే సమయంలో, అత్యవసర సమయాల్లో ప్రాణాపాయం నుండి కాపాడే సీపీఆర్ విధానంపై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.









