తమిళనాడు ముఖ్యమంత్రిగా, స్టార్ హీరోగా విజయ్ సాధించిన రాజకీయ విజయంపై ఆయన కుమారుడు, యువ దర్శకుడు జేసన్ సంజయ్ తొలిసారిగా స్పందించారు. తన తండ్రి సాధించిన ఈ గెలుపును ఒక “చారిత్రక విప్లవం”గా అభివర్ణించారు. ఈ భారీ విజయం వల్ల తమ కుటుంబంపై బాధ్యత మరింత పెరిగిందని, ఇకపై తాము సమాజంలో మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
తన తండ్రి విజయ్ తనను ఎప్పుడూ స్వశక్తితో ఎదగాలని ప్రోత్సహించేవారని, ఏనాడూ స్పూన్ ఫీడింగ్ చేయలేదని జేసన్ సంజయ్ గుర్తుచేసుకున్నారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనేది తన తండ్రి ఆకాంక్ష అని, అందుకు తగినట్లే తన తల్లిదండ్రులు, కుటుంబం తనను పెంచారని తెలిపారు. తమ కుటుంబానికి లభించిన ఈ ప్రజాదరణను, వారసత్వాన్ని గౌరవిస్తూ బాధ్యతాయుతంగా ముందుకు సాగుతానని వివరించారు.
ఇక తన కెరీర్ విషయానికొస్తే, ప్రస్తుతం నటనపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని, కేవలం దర్శకత్వంపైనే పూర్తి దృష్టి సారించానని జేసన్ స్పష్టం చేశారు. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘సిగ్మా’ చిత్రంతో ఆయన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నానని, కుటుంబంపై వచ్చే విమర్శలు, ప్రశంసలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.









