అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రస్తుతానికి సద్దుమణిగాయి. ఇరాన్‌పై దాడులు చేయాలనే ముందస్తు ప్రణాళికను నిలిపివేస్తున్నట్లు, శాంతి ఒప్పందానికి అవకాశాలు ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) జరిపిన రాయబారమే ప్రధాన కారణమని అంతర్జాతీయ అధికార వర్గాలు వెల్లడించాయి. శనివారం ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడిన సౌదీ యువరాజు, ఇరాన్‌పై దాడులు గల్ఫ్ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికా తలపెట్టిన ఈ యుద్ధం వల్ల తన కలల ప్రాజెక్ట్ అయిన ‘సౌదీ విజన్ 2030’ (Saudi Vision 2030) తీవ్రంగా దెబ్బతింటుందని సౌదీ యువరాజు భయపడుతున్నారు. వైవిధ్యభరితమైన ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ పెట్టుబడులు, పర్యాటక రంగాల అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రణాళికకు శాంతిభద్రతలు ఎంతో అవసరం. ఒకవేళ అమెరికా ఇరాన్‌పై కొత్త దాడులు ప్రారంభిస్తే, గల్ఫ్ దేశాలలోని ఇంధన, మౌలిక సదుపాయాలపై ప్రతీకార దాడులు చేస్తామని టెహ్రాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ స్థిరత్వం కోసం యుద్ధాన్ని ముగించడమే ఉత్తమమని సౌదీ రాజు ట్రంప్‌కు స్పష్టం చేశారు.
మరోవైపు యెమెన్‌లోని ఇరాన్ మద్దతు గల హౌతీ రెబల్స్ ముప్పును కేవలం సైనిక బలంతో అణచివేయలేమని సౌదీ అరేబియా తన అనుభవంతో గ్రహించింది. హౌతీలతో మరో పెద్ద సంఘర్షణ మొదలైతే అది సౌదీ ఆర్థిక ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారుతుందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ప్రాంతీయ దేశాలతో చర్చలు జరుపుతుండగా, ఖతార్ ఇరు పక్షాల మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తిరిగి పునరుద్ధరించేందుకు అమెరికా, ఇరాన్, ఒమన్ అధికారులతో కలిసి సౌదీ యంత్రాంగం ముమ్మరంగా చర్చలు జరుపుతోంది.









