దివంగత బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ తీవ్ర మానసిక ఒత్తిడికి, వేధింపులకు గురిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుదర్శన్ రెడ్డి మరణంపై, రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి ఎల్లప్పుడూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిలబడేవారని, ప్రభుత్వంలోని అక్రమాలను నిరంతరం ఎండగట్టేవారని కేటీఆర్ కొనియాడారు. సివిల్ సప్లైస్ స్కామ్‌తో పాటు విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్స్ కుంభకోణాన్ని ఆయన అన్ని ఆధారాలతో సహా బయటపెట్టారని గుర్తుచేశారు. ఆ నివేదికలను ఈడీ కార్యాలయానికి అందజేయడమే కాకుండా, న్యాయం కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారని తెలిపారు. అయితే, సుదర్శన్ రెడ్డి కన్నుమూసిన మరునాడే ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నుంచి నోటీసులు జారీ అవుతూ గైడెన్స్ రావడం అత్యంత బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు ఆయన విమర్శలను భరించలేక, అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించారని ఆరోపించారు.
ఇదే సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాలనా విధానాలపై కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై సాకు చెప్తూ సీఎం రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని, ఆయన చేసిన అసెంబ్లీ తీర్మానం కేవలం ఒక చిత్తు కాగితంతో సమానమని కొట్టిపారేశారు. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని, గురుకులాల్లో 150 మంది విద్యార్థులు మరణించడం, 7 వేల ఐటీ ఉద్యోగాలు ఊడిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు.
మరోవైపు గోదావరి జలాలు వృథాగా సముద్రం పాలు అవుతున్నా రైతాంగానికి సాగునీరు అందించకుండా ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంపింగ్ ప్రక్రియ ద్వారా మిడ్ మానేరుకు నీరు ఎలా వస్తోందో కూడా తెలియని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేవలం హెలికాప్టర్లలో తిరుగుతూ పోజులు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం తన ఆధీనంలోకి (టేకోవర్) తీసుకోవడం వెనుక రూ. 200 కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు వేసిన పెద్ద స్కెచ్ ఉందని కేటీఆర్ సంచలన ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ నాయకులను అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేసే కుట్రలను తాము దీటుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.









