తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం ముదిరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దివంగత ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణాన్ని కేటీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తూ సోమవారం ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఘాటు విమర్శలు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి బతికున్నప్పుడు ఆయన్ని అస్సలు పట్టించుకోకుండా, ఇప్పుడు ఆయన భౌతికకాయంపై రాజకీయం చేస్తున్న ‘మిస్టర్ డ్రామారావు’ కేటీఆర్ అంటూ పొంగులేటి మండిపడ్డారు.
పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం, ఉద్యమకారుడైన పెద్ది సుదర్శన్ రెడ్డికి కనీస గుర్తింపు ఇవ్వకుండా అవమానించిందని పొంగులేటి ఆరోపించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఆయన ఓడిపోయిన తర్వాత కనీసం రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఎందుకు గౌరవించలేదని నిలదీశారు. కల్వకుంట్ల కుటుంబానికి అత్యంత సన్నిహితులైన సంతోష్ రావు, దామోదర్ రావు వంటి వారికి పెద్దపీట వేసి పదవులు కట్టబెట్టిన బీఆర్ఎస్ నాయకత్వం, నిజమైన ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డిని ఎందుకు పక్కనబెట్టిందో సమాధానం చెప్పాలన్నారు.
తమ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ది సుదర్శన్ రెడ్డి అనారోగ్యానికి గురైనప్పుడు.. వైద్య చికిత్స కోసం వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వేగంగా తరలించేందుకు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసిందని పొంగులేటి గుర్తుచేశారు. అంతేకాకుండా ఆయన అంత్యక్రియలను అధికారిక పోలీసు లాంఛనాలతో నిర్వహించి అత్యున్నత గౌరవాన్ని ఇచ్చామన్నారు. ఉద్యమకారులను కేవలం ఓట్ల కోసమే వాడుకుని, అధికారం, కీలక పదవులన్నీ కల్వకుంట్ల కుటుంబమే అనుభవించడం బీఆర్ఎస్‌కు మొదటి నుంచీ అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. శవ రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్న బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెబుతారని పొంగులేటి హెచ్చరించారు.









