హెచ్‌-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు: భారతీయులపై తీవ్ర ప్రభావం!

అమెరికాలో హెచ్‌-1బీ (H-1B) మరియు ఎల్‌-1 వీసాలపై పనిచేస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ ఉద్యోగులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నుంచి మరో ఆర్థిక భారం పడనుంది. వీసాల రెన్యువల్ (పొడిగింపు) దరఖాస్తులపై కూడా వేల డాలర్ల అదనపు ఫీజును వసూలు చేసే కొత్త ప్రతిపాదనను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఖరారు చేస్తోంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే అమెరికాలోని టెక్ కంపెనీలతో పాటు భారత ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం ఇప్పటివరకు కొత్త హెచ్‌-1బీ లేదా ఎల్‌-1 దరఖాస్తులకు మాత్రమే వర్తించే ‘9-11 రెస్పాన్స్ అండ్ బయోమెట్రిక్ ఎంట్రీ-ఎగ్జిట్ ఫీజు’ను ఇకపై వీసా పొడిగింపులకు కూడా వర్తింపజేయాలని భావిస్తున్నారు. ఈ కొత్త రూల్ ప్రకారం, హెచ్‌-1బీ వీసా పొడిగింపు ప్రతిసారీ 4,000 డాలర్లు (సుమారు రూ. 3.81 లక్షలు), ఎల్‌-1 వీసా పొడిగింపుకు 4,500 డాలర్లు (సుమారు రూ. 4.29 లక్షలు) అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 50 మందికి పైగా ఉద్యోగులు ఉండి, అందులో సగానికి పైగా విదేశీ వీసాదారులే ఉన్న కంపెనీలన్నింటికీ ఈ నియమం వర్తిస్తుంది.

ఈ అదనపు ఫీజుల భారం వల్ల అత్యధికంగా నష్టపోయేది మన దేశానికి చెందిన నిపుణులే. యూఎస్‌సీఐఎస్ (USCIS) నివేదికల ప్రకారం, 2025లో పొడిగింపు పొందిన మొత్తం హెచ్‌-1బీ వీసాలలో ఏకంగా 77.6 శాతం (సుమారు 2.26 లక్షలు) భారతీయులవే కావడం విశేషం. అమెజాన్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో వీసా పొడిగింపులపై ఆధారపడి ఉండటంతో, ఈ విధానం అమలైతే ఆయా కంపెనీలపై కోట్లాది రూపాయల మేర అదనపు భారం పడనుంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు