బంగాళాఖాతంలోర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విరామం లేకుండా కురుస్తున్నాయి. దీని ఫలితంగా నేడు భాగ్యనగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ హైదరాబాద్ నగరానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం రోజంతా మేఘావృతమై ఉంటుందని, పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, వికారాబాద్ మరియు సంగారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి.
నగరంలో రోడ్లపైకి వచ్చే వాహనదారులు, సాధారణ ప్రజలు వర్షాల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. నిరంతరం కురుస్తున్న వర్షాల వల్ల రోడ్లపై నీరు నిలిచే ప్రమాదం ఉన్నందున అత్యవసర ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.









