ఒక సాధారణ కారు డ్రైవర్ కుమారుడిగా జీవితాన్ని ప్రారంభించిన భద్రాచలానికి చెందిన కుంజా రాము, స్వయంకృషితో ఎదిగి ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈవోగా మారి ఎంతోమంది యువతకు ప్రేరణగా నిలిచారు. ఆయన స్థాపించిన ‘ఈ-కార్ట్ సాఫ్ట్ లాబ్స్’ సంస్థ హైదరాబాద్‌లో జరిగిన ‘తెలంగాణ గ్లోబల్ ఎలైట్-2026’ పురస్కారాల వేడుకల్లో ‘ఉత్తమ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ కంపెనీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును గెలుచుకుంది. ప్రముఖ సినీ నటి అదా శర్మ చేతుల మీదుగా రాము ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు.
రాము తండ్రి కుంజా రాఘవులు భద్రాచలంలోని ఐటీడీఏ (ITDA) ప్రాజెక్ట్ ఆఫీసర్ వద్ద వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. తండ్రి అందించిన ప్రోత్సాహంతో చదువుపై దృష్టి సారించిన రాము, ఇంజినీరింగ్ పూర్తి చేసి తొలినాళ్లలో అమెరికాలో ఐటీ ఉద్యోగం సాధించారు. అనంతరం సొంతంగా ఏదైనా సాధించాలనే సంకల్పంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చి 2016లో రూ. 50 లక్షల పెట్టుబడితో ‘ఈ-కార్ట్ సాఫ్ట్ లాబ్స్’ కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంస్థ రూ. 10 కోట్ల వార్షిక లావాదేవీలకు చేరుకోవడమే కాకుండా పలువురు నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది.
రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ‘ఆగ్రోస్ నెక్సస్’ ఎకో సిస్టమ్‌ను రాము రూపొందించారు. దీని ద్వారా రైతులు తమ నాణ్యమైన పంట ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా నేరుగా కొనుగోలుదారులకు విక్రయించే వెసులుబాటు లభిస్తుంది. సాంకేతిక రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు మరియు ఐటీ రంగంలో సాధించిన ఈ విజయానికి గానూ ఐటీ ప్రముఖులు, నెటిజన్లు రాముపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.









