విజయనగరం జిల్లా భోగాపురంలో ఇటీవల ప్రారంభమైన ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం’ పేరు ముందు ‘వైజాగ్’ అని ప్రదర్శించడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న వివాదానికి ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెరదించారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ నిబంధనలు మరియు మార్గదర్శకాల ప్రకారమే విమానాశ్రయం పేరులో వైజాగ్ అని పొందుపరిచారని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అనవసరపు అపోహలు, వదంతులు నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం ఉదాహరణను ప్రస్తావిస్తూ మంత్రి ఈ అంశాన్ని వివరించారు. శంషాబాద్ విమానాశ్రయం భౌగోళికంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ, దానిని అంతర్జాతీయ స్థాయిలో ‘హైదరాబాద్ ఎయిర్పోర్ట్’ అని ఎలా పిలుస్తున్నారో.. అలాగే భోగాపురం విమానాశ్రయం విజయనగరం జిల్లా రెవెన్యూ పరిధిలోకి వచ్చినప్పటికీ ‘వైజాగ్’ పేరుతో పిలవడంలో ఎలాంటి తప్పులేదని వెల్లడించారు. అంతర్జాతీయ విమానయాన గుర్తింపు, ప్రయాణికుల సౌకర్యార్థం నగరాల పేర్లను వాడటం సహజమని పేర్కొన్నారు.
అలాగే స్థానికుల ఉద్యోగ అవకాశాలపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ, విమానాశ్రయంలోని 70 శాతం బ్లూ కాలర్ ఉద్యోగాలను స్థానిక విజయనగరం ప్రజలకే కేటాయించామని మంత్రి తెలిపారు. అర్హత, అనుభవాన్ని బట్టి వైట్ కాలర్ ఉద్యోగాల్లోనూ ప్రాధాన్యత ఉంటుందని, ఈ విషయంలో అపోహలకు తావులేదని స్పష్టం చేశారు. స్థానికులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు కాంట్రాక్టు నిర్వహణ సంస్థ జీఎంఆర్ (GMR) ప్రతినిధులతో మరోసారి సమావేశమై చర్చిస్తామని మంత్రి కొండపల్లి తెలిపారు.









