కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి ఆందోళనలు మరియు అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనల్లో పాల్గొంటున్న యువత, విద్యార్థుల పట్ల పోలీసులు మరియు అధికారులు అత్యంత విచక్షణతో, సహనంతో వ్యవహరించాలని స్పష్టం చేసింది. హింసను అదుపు చేసే నెపంతో భద్రతా బలగాలు తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగితే పరిస్థితులు మరింత దారి తప్పే ప్రమాదముందని హెచ్చరించింది.
జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ సమీపంలో జరిగిన నిరసనల్లో రాళ్లదాడి, హింస కారణంగా జరిగిన నష్టానికి సదరు ఆర్గనైజర్లను బాధ్యులను చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు అసలు ఏం కోరుకుంటున్నారు, వారి ఆవేదనకు కారణమేంటో ఓపికగా వినడమే అత్యంత శక్తివంతమైన పరిపరిష్కారమని ధర్మాసనం అభిప్రాయపడింది. యువతను కౌన్సెలింగ్ ద్వారా శాంతింపజేయాలే తప్ప, ప్రభుత్వం లేదా పోలీసుల వైపు నుండి తీవ్రమైన అణచివేత చర్యలు ఉండకూడదని సూచించింది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుత నిరసనలు తెలిపే హక్కును కాపాడుతూనే, శాంతిభద్రతలను పరిరక్షించడంలో లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు పూర్తి విచక్షణ అధికారాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మరియు సంబంధిత రాష్ట్రాలు సమర్పించే నివేదికలను, అఫిడవిట్లను పరిశీలించిన పిమ్మటే ఈ వ్యవహారంలో తదుపరి ఆదేశాలు ఇస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.









