వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ నిరక్ష్య ధోరణి మరియు రైతు వ్యతిరేక విధానాల వల్ల రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆయన, బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మాజీ ప్రభుత్వం హయాంలో కిలో పొగాకు సగటున రూ.289 నుండి రూ.365 వరకు ధర పలికిందని, కానీ ప్రస్తుత పాలనలో ఆ ధర రూ.236కి పడిపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కేవలం 21 శాతం పంటను మాత్రమే కొనుగోలు చేసి, మిగిలిన పంట విషయంలో సిండికేట్లతో కుమ్మక్కై రైతులను దగా చేస్తోందని విమర్శించారు. గిట్టుబాటు ధర లభించక వెంకటేశ్వరరావు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నా, ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమన్నారు.
తమ హయాంలో అందించిన సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా మరియు ఉచిత పంటల బీమా పథకాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని జగన్ మండిపడ్డారు. గిట్టుబాటు ధరలు కల్పించి రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.









