‘ఆధార్’ పేరిట వచ్చే నకిలీ మెసేజ్‌లను నమ్మవద్దు: తెలంగాణ పోలీస్ హెచ్చరిక

ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఆధార్ అప్‌డేట్ పేరుతో ప్రజలను మోసం చేసేందుకు కొత్త రకం ఎత్తుగడలు వేస్తున్నారు. తక్షణమే వివరాలు అప్‌డేట్ చేసుకోకపోతే బ్యాంక్ ఖాతాలు బ్లాక్ అవుతాయని లేదా నిలిపివేయబడతాయని బ్యాంకుల పేరిట నకిలీ సందేశాలు పంపుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఈ తరహా నకిలీ ఎస్సెమ్మెస్‌లు మరియు వాట్సాప్ మెసేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకూడదని తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

అనుమానాస్పద మెసేజ్‌లలో ఉండే లింక్‌లను క్లిక్ చేయడం వల్ల తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదముందని పోలీసులు స్పష్టం చేశారు. ఆ లింక్స్ ద్వారా మొబైల్ ఫోన్లలో నకిలీ ఏపీకే (APK) ఫైల్స్ డౌన్‌లోడ్ అయ్యేలా చేసి, ఫోన్లను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారని వెల్లడించారు. బ్యాంకింగ్ లావాదేవీలు లేదా అప్‌డేట్ల కోసం ఎల్లప్పుడూ బ్యాంకుల అధికారిక యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.

అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పోలీసులు తెలిపారు. ఒకవేళ ఎవరైనా ఈ సైబర్ మోసాల బారిన పడితే తక్షణమే ‘1930’ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌ ద్వారా సంబంధిత అధికారులను సంప్రదించాలని స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు