రాయలసీమ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఎల్నినో పరిస్థితులను అధిగమించేందుకు రాబోయే 2027 జూన్ వరకు శ్రీశైలం జలాలను ప్రధానంగా తాగునీటి అవసరాలకే భద్రపరచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి ఉన్న 63 శాతం వాటాలో మొదటి ప్రాధాన్యత తాగునీటికే ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం శ్రీశైలంలో 119 టీఎంసీల నీరు నిల్వ ఉందని, రాబోయే పది రోజుల్లో మరో 100 టీఎంసీల మేర వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. హంద్రీనీవా పరిధిలోని జలాశయాల తాగునీటికి 13 టీఎంసీలు, పోతిరెడ్డిపాడు పరిధిలోని రిజర్వాయర్లకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లు వివరించారు. అలాగే అంతర్రాష్ట్ర ఒప్పందంలో భాగంగా తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు, నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల పరిధిలో తాగునీటి కోసం 32 టీఎంసీలు కేటాయించనున్నట్లు తెలిపారు.
వర్షాలు మరియు ఇన్ ఫ్లో పరిస్థితులను ప్రతి వారం సమీక్షిస్తూ ఎల్నినో ప్రభావాన్ని తట్టుకునేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతామని మంత్రి తెలిపారు. జిల్లాల కలెక్టర్లతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ నీటి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.









