ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గాన్ని దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి, పల్లెలు, పట్టణాలలో రోడ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సాస్కీ, ఆర్అండ్బీ మరియు పంచాయతీరాజ్ శాఖల భాగస్వామ్యంతో రూ.200 కోట్ల అంచనా వ్యయంతో ఏకంగా 307 కిలోమీటర్ల మేర కొత్త రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేశారు.
ఈ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇప్పటికే రూ.100 కోట్ల వ్యయంతో 152 కిలోమీటర్ల పొడవైన 611 రోడ్ల నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయగా, మరో 70 రోడ్ల పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో నియోజకవర్గంలో దాదాపు 80 శాతం మేర కొత్త రోడ్ల నిర్మాణం పూర్తయినట్లయింది. ఏళ్ల తరబడి సరైన రోడ్డు సౌకర్యం లేక అవస్థలు పడిన మారుమూల గ్రామాలు, మత్స్యకార కాలనీలు మరియు గ్రామీణ ప్రజల ప్రయాణ కష్టాలు తీరి, రవాణా వ్యవస్థ మెరుగైంది.
ముఖ్యంగా ఉప్పాడ తీరంలో అలల కోతకు గురైన కొత్త మాయాపట్నం పునరావాస కాలనీలో రూ.1.52 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను, అలాగే కొత్తసూరాడపేట కాలనీకి రూ.93 లక్షలతో సిమెంట్ రోడ్డును నిర్మించారు. వీటితో పాటు అమరవిల్లి-రామన్నపాలెం బీచ్ రోడ్డు, ముమ్మడివారిపాడు శాశ్వత రహదారి మరియు గత ఏడేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన పిఠాపురం-ఉప్పాడ ఆర్అండ్బీ రోడ్డు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించి విద్యార్థులు, రైతులు, వ్యాపారులకు ఊరట కలిగించారు.









