ఆన్‌లైన్ షాపింగ్, టికెట్ బుకింగ్ సమయాల్లో ఆటోమేటిక్ యాడ్-ఆన్‌లు, దాచిన ఛార్జీలతో వినియోగదారులను తప్పుదోవ పట్టించే ‘డార్క్ పాటర్న్స్’పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. జెప్టో, బుక్‌మైషో, ఇండిగో, ఫిజిక్స్ వాలాతో సహా మొత్తం తొమ్మిది ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) దాదాపు రూ. 20 లక్షల వరకు జరిమానాలు విధించిందని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా స్పష్టం చేసింది. కస్టమర్లలో భయాందోళనలు రేకెత్తించే మెసేజ్‌లు, ముందుగానే టిక్ అయి ఉండే ఆటోమేటిక్ ఆప్షన్లు మరియు హిడెన్ ఫీజులపై సీసీపీఏ ఈ చర్యలు తీసుకుంది.
ముఖ్యంగా జెప్టో యాప్ ప్రారంభంలో తక్కువ ధర చూపించి చెల్లింపు సమయంలో హ్యాండ్లింగ్ ఛార్జీలు, ఆటోమేటిక్ మెంబర్‌షిప్‌లు జోడించడంతో రూ. 7 లక్షల ఫైన్ పడగా, ఆ సంస్థ ఆ విధానాన్ని నిలిపివేసింది. అలాగే బుక్‌మైషోలో ‘బుక్ ఏ స్మైల్’ దాతృత్వ విరాళం ముందే సెలెక్ట్ (ప్రీ-టిక్) చేసి ఉంచడంపై నిషేధం విధించారు. మరోవైపు ఇండిగో సంస్థ అదనపు సేవలను తిరస్కరించే సమయంలో “No, I will take risk” వంటి భయాందోళనలు కలిగించే సమ్మతి వ్యాక్యాలను ఉపయోగించగా, వాటిని సాధారణ వాక్యాలుగా మార్చాల్సి వచ్చింది. ఎడ్యుకేషన్ యాప్ ఫిజిక్స్ వాలాపై కూడా రూ. 10 విరాళాన్ని ఆటో-సెలెక్ట్ చేయడం, ఉచిత కోర్సుల పేరుతో వ్యక్తిగత సమాచారం సేకరించడం వల్ల రూ. 5 లక్షల జరిమానా పడింది.
వీటితో పాటు ఫస్ట్ క్రై (రూ. 2 లక్షలు), అనుజ్ జిందాల్ (రూ. 3 లక్షలు), ఫార్మ్‌ఈజీ (రూ. 1 లక్ష), మెక్‌అఫీ (రూ. 1 లక్ష) మరియు స్పైస్‌జెట్ (రూ. 1 లక్ష) సంస్థలకు కూడా సీసీపీఏ అదనపు రుసుములు, తప్పుదోవ పట్టించే నోటిఫికేషన్ల కారణంగా పెనాల్టీలు విధించింది. భారతదేశం 2023లో విడుదల చేసిన డార్క్ పాటర్న్స్ నియంత్రణ మార్గదర్శకాల ప్రకారం ఫాల్స్ అర్జెన్సీ, సబ్‌స్క్రిప్షన్ ట్రాప్స్ వంటి 13 మోసపూరిత డిజైన్ల నుంచి వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విరుచుకుపాటను ముమ్మరం చేసింది.









