2013 రేప్ కేసులో తరుణ్ తేజ్‌పాల్‌కు ఊహించని షాక్: దోషిగా నిర్ధారిస్తూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు!

 ‘తెహల్కా’ పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బాంబే హైకోర్టులో తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. 2013 నాటి సంచలనాత్మక లైంగిక దాడి కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ విచారణ కోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను బాంబే హైకోర్టు రద్దు చేసింది. జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్‌సాండేకర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ కేసును సమగ్రంగా విచారించి, ఐపీసీలోని రేప్ నిబంధనల ప్రకారం తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా ఖరారు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

2013 నవంబరులో గోవాలో జరిగిన ‘థింక్‌ఫెస్ట్’ ఈవెంట్ సమయంలో ఒక హోటల్ లిఫ్ట్‌లో తనపై తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఆయన వద్ద పనిచేసిన మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో 2021లో గోవాలోని మాపుసా సెషన్స్ కోర్టు తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ‘అక్విట్టల్’ తీర్పు ఇవ్వగా, దానిని సవాలు చేస్తూ గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. విచారణ కోర్టు ఆధారాలను సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం వాదించడంతో, హైకోర్టు ఆ తీర్పును తప్పుబడుతూ ఆయనను దోషిగా నిర్ధారించింది.

 తీర్పు వెలువడే సమయంలో కోర్టు హాలులోనే ఉన్న 62 సంవత్సరాల తరుణ్ తేజ్‌పాల్, తన వయసును దృష్టిలో ఉంచుకుని కనికరం చూపాలని న్యాయస్థానాన్ని వేడుకున్నారు. ఈ కేసులో శిక్షకు సంబంధించిన వివరాలను హైకోర్టు మధ్యాహ్నం వెల్లడించనుండగా, నేరం యొక్క తీవ్రతను బట్టి ఆయనకు కనీసం 10 సంవత్సరాల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు