రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢీకొట్టడంతో పి.జి. వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయిన దారుణ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
అమరావతిలోని సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ ఘటన తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన మెడికోలు ప్రియాంక, ఉమేష్లకు మెరుగైన వైద్యం అందించాలని, ముఖ్యంగా హైదరాబాద్లో చికిత్స పొందుతున్న ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇప్పటికే ఇద్దరు నిందితులు సూర్యవరపు దశవంత్, జోసెఫ్లను అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేయగా, విచారణను వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడానని సీఎం స్పష్టం చేశారు.









