ప్రముఖ అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ సంస్థ ‘పోపాయ్స్’ తీవ్ర వివాదంలో చిక్కుకుంది. తాము కొనుగోలు చేసిన ఫ్రైడ్ చికెన్‌లో కండోమ్ లాంటి వస్తువు లభించిందని ఆరోపిస్తూ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం, హ్యూస్టన్‌కు చెందిన జస్టిన్ హోవార్డ్, డానియెల్ మెకిన్నన్ అనే దంపతులు న్యాయపోరాటానికి దిగారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ 1.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 12.5 కోట్లకు పైగా) నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ సదరు సంస్థపై హ్యారిస్ కౌంటీ కోర్టులో దావా వేశారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 25న స్థానిక పోపాయ్స్ రెస్టారెంట్ నుండి చికెన్ కొనుగోలు చేసి ఇంటి వద్ద తింటుండగా, ఒక చికెన్ ముక్కలో కండోమ్ తరహా వస్తువు బయటపడింది. దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన దంపతులు వెంటనే ఆహారం తినడం నిలిపివేశారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు తిరిగి రెస్టారెంట్‌కు వెళ్లగా, అక్కడి సిబ్బంది తమను చూసి నవ్వడమే కాకుండా, మొదట్లో డబ్బులు కూడా రిఫండ్ చేయడానికి నిరాకరించారని వారు ఆరోపించారు.
ఆహార భద్రత నిబంధనల తీవ్ర ఉల్లంఘన, బాధ్యతారాహిత్యం మరియు వినియోగదారుల హక్కులకు భంగం కలిగించినందుకు పోపాయ్స్ మాతృసంస్థ ‘రెస్టారెంట్ బ్రాండ్స్ ఇంటర్నేషనల్’తో పాటు స్థానిక ఫ్రాంచైజీ నిర్వాహకులను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా 4,000కు పైగా శాఖలు ఉన్న పోపాయ్స్ యాజమాన్యం ఈ సంచలన ఆరోపణలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందనను వెల్లడించలేదు.









