జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో చేనేత కార్మికులు పట్టణ పురవీధుల్లో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక మార్కండేయ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వల్లకాటి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చేనేత వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని, రాష్ట్రంలో నేతన్నల ఆకలి చావులు లేకుండా తగిన భరోసా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు రూ. 25,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోందని, అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడి ప్రతి చేనేత కార్మికుడికి ఆర్థిక సాయం అందించాలని రాజ్ కుమార్ కోరారు. అలాగే పద్మశాలి కార్పొరేషన్ ద్వారా చేనేత వృత్తితో పాటు ఇతర అనుబంధ వృత్తులు చేసుకుంటున్న పద్మశాలీలకు కూడా ఆర్థిక చేయూత ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పద్మశాలీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మేకల జయరాములు, మండల అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు మహంకాళి కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్షుడు జంగం రాములుతో పాటు పలువురు పద్మశాలి సంఘం నాయకులు, పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.









