తెలంగాణ తాగు, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడే కనీస అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పార్టీ ప్రాజెక్టుల అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తోందని ఆరోపించారు. జూరాలలో ఉన్న నీటిమట్టంతో మొత్తం ఆయకట్టుకు నీరు అందించడం అసాధ్యమని, ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
పదేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని జూపల్లి మండిపడ్డారు. దాదాపు రూ.80 వేల కోట్ల వ్యయం అయ్యే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేవలం రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. కనీసం కాలువలు కూడా తవ్వకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు 68.5 శాతం వాటా రావాల్సి ఉండగా, కేసీఆర్ హయాంలో తెలంగాణకు కేవలం 299 టీఎంసీలు మాత్రమే కేటాయించి, ఏపీకి 512 టీఎంసీలు దక్కేలా చేశారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణ సాగునీటి రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు.









