తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మల్టీ-క్రోర్ చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కఠిన చర్యలు చేపట్టింది. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన కార్యాలయాలతో పాటు సంస్థ డైరెక్టర్లు మల్ల విజయ ప్రసాద్, వరహ రామకృష్ణ సత్య శ్రీనివాసరావు అల్లా నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. విశాఖపట్నం, హైదరాబాద్ సహా మొత్తం ఐదు ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం.
సోదాల్లో రూ.1.01 కోట్ల సముపార్జన నగదుతో పాటు కీలకమైన ఆస్తి పత్రాలు, డిజిటల్ పరికరాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలు, ఇతర డిజిటల్ ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తనిఖీలతో సంస్థకు సంబంధించిన మరిన్ని ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
దర్యాప్తులో భాగంగా సంస్థకు చెందిన 182 బ్యాంకు ఖాతాలను, 6 లగ్జరీ వాహనాలను ఈడీ అధికారులు ఫ్రీజ్ చేశారు. చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల పేరుతో నిధుల మళ్లింపు జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సీజ్ చేసిన పత్రాలు, డిజిటల్ పరికరాలు, బ్యాంకు లావాదేవీలను విశ్లేషించిన అనంతరం కేసులో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.









