ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో ప్రేమ వివాహం వ్యవహారం అనూహ్య మలుపు తిరిగింది. ప్రేమించి పోలీస్‌స్టేషన్‌లో పెళ్లి చేసుకున్న యువకుడు.. అనంతరం తన భార్యను ఆమె తల్లిదండ్రులకు అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. డబ్బులు చెల్లిస్తే యువతిని ఇంటి వద్దకు తీసుకొచ్చి అప్పగిస్తామని కొందరు వ్యక్తులు చెప్పినట్లు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన రాజేశ్వరి, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన మధు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ మేజర్లేనని కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగు రోజుల క్రితం రాజేశ్వరి ఏలూరులోని కాలేజీకి వెళ్లిన సమయంలో మధు స్నేహితులు నలుగురు ఆమెను తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అనంతరం వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో మధు, రాజేశ్వరి ప్రేమ వివాహం చేసుకున్నట్లు సమాచారం.
వివాహం అనంతరం వారిని ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లి జరిగినప్పటి నుంచి తమ కుమార్తె ఎక్కడ ఉంది? ఎలా ఉంది? అనే సమాచారం లేకపోవడంతో రాజేశ్వరి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో యువతిని తమకు అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీనిపై కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో అధికారులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఆరోపణల్లో వాస్తవాలను విచారణ అనంతరం వెల్లడించనున్నారు.









