ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు: మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు సర్కార్ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను ప్రారంభించాలని మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ ప్రక్రియకు అవసరమైన సామగ్రి సేకరణతో పాటు బ్యాలెట్ బాక్సులు, ఇతర పోలింగ్ పరికరాల సన్నాహకాల కోసం తక్షణమే టెండర్ల ప్రక్రియను చేపట్టాలని సూచించింది.

ఎన్నికల నిర్వహణకు ఆటంకంగా మారిన న్యాయపరమైన చిక్కులను, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివిధ వ్యాజ్యాలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాబోయే అక్టోబర్ నాటికి స్థానిక పోరును పూర్తి చేయాలనే లక్ష్యంతో బిసి, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారును కొలిక్కి తేవడంతో పాటు, అవసరమైన చట్టసవరణల ప్రక్రియపై కూడా వేగంగా కసరత్తు చేస్తోంది.

మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సైతం ఈ సన్నాహకాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తోంది. ఓటర్ల జాబితాల తుది రూపకల్పన, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. అక్టోబర్‌లోపు ఎన్నికలను పూర్తి చేసేలా ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేయడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు