ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు. మెగా డీఎస్సీ నిర్వహణపై వైసీపీ చేస్తున్న నిరాధార ఆరోపణలను తిప్పికొడుతూ, సభ లోపలైనా లేదా బయటైనా చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. సమయం, వేదిక జగనే ఖరారు చేయాలని, తాను ఎటువంటి విచారణలు, ఈడీ, సీబీఐ కేసుల పరిధిలో లేనని, బహిరంగంగా వాస్తవాలు తేల్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఎద్దేవా చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకంతో మెగా డీఎస్సీకి శ్రీకారం చుట్టారని, దేశంలోనే అత్యంత వేగంగా కేవలం 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని లోకేశ్ తెలిపారు. టీసీఎస్ అయాన్ (TCS iON) ద్వారా 42 వేల ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ బ్యాంక్‌తో అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించామని, పేపర్ లీకేజీ ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. స్పోర్ట్స్ కోటా, రిజర్వేషన్ల ప్రక్రియలను రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే అమలు చేశామని ఆధారాలతో సహా వివరించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా చేపట్టకపోవడం వల్లే లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ ఏడాది మరో 3,000 పోస్టులతో డీఎస్సీ నిర్వహించడంతో పాటు, భవిష్యత్తులో ప్రతి ఏటా క్రమం తప్పకుండా డీఎస్సీ నియామకాలు చేపడతామని లోకేశ్ భరోసా ఇచ్చారు.









