నటి ట్విషా శర్మ ఆత్మహత్య కేసు: భర్త, అత్తల వేధింపులపై సీబీఐ సంచలన ఛార్జ్‌షీట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి, మాజీ మిస్ పూణే ట్విషా శర్మ మృతి కేసులో సీబీఐ 30 పేజీల కీలక ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. పెళ్లయిన ఐదు నెలల కాలంలోనే భర్త సమర్థ్ సింగ్, రిటైర్డ్ జడ్జి అయిన అత్త గిరిబాలా సింగ్ పెట్టిన తీవ్ర మానసిక క్షోభ, వేధింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సీబీఐ స్పష్టం చేసింది. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసింది.

ఆమె మరణానికి ముందు చివరి 90 నిమిషాల పరిణామాలను సీబీఐ సీసీటీవీ దృశ్యాలు, కాల్ డేటా ఆధారంగా సమగ్రంగా వివరించింది. మే 12 రాత్రి 9:36 గంటలకు “నన్ను ప్రశాంతంగా చావనివ్వండి” అంటూ ట్విషా తన వదినకు వాట్సాప్ సందేశం పంపి మేడపైకి వెళ్లింది. అనంతరం తల్లిదండ్రులకు ఫోన్ చేసి భర్త హింసాత్మక ప్రవర్తన గురించి కన్నీటితో మొరపెట్టుకుంది. రాత్రి 10:23 గంటలకు కుటుంబ సభ్యులు మేడపైకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో కనిపించడంతో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

భర్త పూర్వ సంబంధాల పేరుతో నిందించడం, డీమాట్ ఖాతాలోని రూ.20 లక్షల పెట్టుబడులను ఉమ్మడి ఖాతాకు బదిలీ చేయాలని ఒత్తిడి తేవడం, అబార్షన్ చేసుకున్న సమయంలో అత్త ఆమెను ‘హంతకురాలు’ అంటూ తీవ్రంగా నిందించడం వంటి ఘటనలే ఆత్మహత్యకు దారితీశాయని సీబీఐ వెల్లడించింది. ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ బోర్డ్ రెండో పోస్ట్‌మార్టమ్ నివేదిక కూడా ఇది ఉరేసుకోవడం వల్లే సంభవించిన మరణమని తేల్చగా, కట్న వేధింపులు మరియు డిజిటల్ ఆధారాల రికవరీపై దర్యాప్తు కొనసాగుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు