షావుకారు జానకి మృతి.. సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం

ప్రముఖ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కళారంగంలోకి అడుగుపెట్టిన షావుకారు జానకి.. దాదాపు ఏడు దశాబ్దాల పాటు సినీ రంగంలో తనదైన ముద్ర వేశారని సీఎం గుర్తుచేశారు.

‘షావుకారు’ చిత్రంలో అసమాన ప్రతిభ కనబరిచి షావుకారు జానకిగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 400 చిత్రాల్లో నటించడంతో పాటు హిందీ, మలయాళ సినిమాల్లోనూ తన నటనా ప్రతిభను చాటుకున్నారని కొనియాడారు. విభిన్న పాత్రలను సహజంగా పోషిస్తూ దక్షిణ భారత సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు.

షావుకారు జానకి సినీ, నాటక రంగాలకు అందించిన సేవలు చిరస్మరణీయమని సీఎం పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు