రెండు తెలుగు రాష్ట్రాల్లో మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే పులసల సీజన్ యానాంలో ప్రారంభమైంది. యానాం గౌతమి గోదావరికి ఎర్రనీరు పోటెత్తిన సమయంలో పులస చేపలు లభిస్తాయి. ఇటీవల పులసల జాడ కనిపించకపోయినా.. శుక్రవారం యానాం మార్కెట్‌కు సుమారు రెండు కిలోల బరువున్న పులస చేప రావడంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి నెలకొంది.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఈ పులస చిక్కింది. యానాం మార్కెట్‌లో దీనిని నాటి పార్వతి అనే వ్యాపారి రూ.24 వేలకు కొనుగోలు చేసినట్లు తెలిపారు. అనంతరం కొంత లాభం జోడించి వినియోగదారులకు విక్రయించనున్నట్లు చెప్పారు. దీంతో ఈ సీజన్‌లో పులస ధర మరోసారి చర్చనీయాంశంగా మారింది.
గోదావరికి వరద నీరు వచ్చిన సమయంలో లభించిన తొలి పులస రూ.15 వేలు, రెండో పులస రూ.14 వేల ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. తాజాగా లభించిన మూడో పులస ఏకంగా రూ.24 వేలకు విక్రయమై.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యధిక ధర పలికిన పులసగా నిలిచింది. దీంతో పులస ప్రియుల్లో మరింత ఆసక్తి నెలకొంది.









