హైదరాబాద్‌లోని చారిత్రక మిర్ ఆలం చెరువును అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబ సమేతంగా వచ్చి ప్రకృతి అందాలు, జలక్రీడలు, వినోదాన్ని ఆస్వాదించేలా సుందరీకరణ పనులు చేపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురువారం చెరువును ఆకస్మికంగా పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు.
మిర్ ఆలం చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 544 పైల్స్‌లో 273, 62 పైల్ క్యాప్స్‌లో 28 పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. చెరువు పునరుజ్జీవనం, పరిసర ప్రాంతాలు, ఐలాండ్ల అభివృద్ధిపైనా దృష్టి సారించారు.
చెరువులోకి మురుగునీరు చేరకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వర్షపు నీరు మూసీ నదిలోకి సాఫీగా వెళ్లేలా నాలాలను విస్తరించి, నీటి నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. అన్ని పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.









