విజయవాడ నుంచి అమరావతికి మరో రాజబాటకు అడుగులు పడుతున్నాయి. కృష్ణా నదిపై అంతర్జాతీయ ప్రమాణాలతో సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కేవలం రాకపోకలకు మాత్రమే పరిమితం కాకుండా.. అమరావతికి ఐకానిక్ ల్యాండ్మార్క్గా నిలిచేలా ఈ వంతెనను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టే దిశగా కసరత్తు జరుగుతోంది.
ప్రస్తుతం విజయవాడ నుంచి అమరావతికి వెళ్లాలంటే వారధి లేదా ప్రకాశం బ్యారేజీ మీదుగా రాజధాని ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. పెరుగుతున్న వాహనాల రద్దీతో ఈ రెండు మార్గాల్లో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో అమరావతిలో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు, రాకపోకలు పెరిగితే ఈ రెండు వంతెనలపై ట్రాఫిక్ మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గంగా కొత్త సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
కొత్త వంతెన అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి అమరావతికి రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రాజధాని మౌలిక వసతుల్లో ఇది కీలకంగా మారనుంది. అంతేకాకుండా వంతెనను ప్రత్యేక డిజైన్తో నిర్మించి పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దే ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు అమరావతి అభివృద్ధికి ప్రతీకగా నిలిచేలా ఈ ప్రాజెక్టును రూపొందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.









