సికింద్రాబాద్లోని మద్రాస్ రెజిమెంట్ ప్రాంతంలో అత్యాధునిక ఆయుధాలు చోరీకి గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ కాంపౌండ్లోకి దుండగులు చొరబడి, ఆయుధాలు భద్రపరిచే గదికి సంబంధించిన తాళాన్ని పగలగొట్టి 12 ఆయుధాలను అపహరించినట్లు సమాచారం. ఘటనపై ఆర్మీ అధికారులు బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సమాచారం ప్రకారం చోరీకి గురైన ఆయుధాల్లో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, ఆరు పిస్టళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి కూడా మాయమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. భద్రతా వలయాన్ని దాటి ఆర్మీ కాంపౌండ్లోకి దుండగులు ఎలా ప్రవేశించారు? ఆయుధాల గది తాళాలను ఎలా పగలగొట్టారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ఈ ఘటన రక్షణ వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో ఆయుధాల చోరీకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు, పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. చోరీకి గురైన ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత భద్రత కలిగిన ఆర్మీ ప్రాంతంలో ఈ స్థాయిలో చోరీ జరగడంపై భద్రతా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Post Views: 17









