హమాస్‌కు భారీ షాక్.. $5.6 లక్షల క్రిప్టో స్వాధీనం చేసుకున్న FBI!

హమాస్‌కు అమెరికా భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఆ సంస్థ కోసం సమీకరించిన 5.6 లక్షల డాలర్లకు పైగా విలువైన క్రిప్టోకరెన్సీని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) స్వాధీనం చేసుకుంది. అంతేకాకుండా హమాస్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ నిధుల సేకరణ, నియామకాల నెట్‌వర్క్‌ను కూడా దెబ్బతీసినట్లు అమెరికా న్యాయ శాఖ వెల్లడించింది. మంగళవారం నిర్వహించిన ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను న్యాయ శాఖ ప్రకటించింది.

హమాస్ నిధుల సేకరణ, నియామకాల కోసం ఉపయోగించిన పలు వెబ్‌సైట్ డొమైన్‌లు, కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లను అమెరికా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. క్రిప్టోకరెన్సీ ద్వారా నిధులను సమీకరించే వ్యవస్థపై దర్యాప్తు చేపట్టి.. ఆ నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని గుర్తించినట్లు పేర్కొంది. ఈ చర్యతో హమాస్‌కు ఆన్‌లైన్ ద్వారా నిధులు సమీకరించే మార్గాలకు గణనీయంగా అంతరాయం కలిగినట్లు అమెరికా న్యాయ శాఖ తెలిపింది.

ఇదే సమయంలో హమాస్‌కు డబ్బు విరాళంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ సంస్థను సంప్రదించిన వేలాది మంది వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు. నిధుల సేకరణ, నియామకాల కోసం హమాస్ ఉపయోగిస్తున్న డిజిటల్ మౌలిక వసతులపై ఈ ఆపరేషన్ ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తాజా చర్యతో హమాస్ ఆన్‌లైన్ ఫండింగ్ నెట్‌వర్క్‌పై అమెరికా మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు