బెట్టింగ్‌ ఉచ్చులో తెలంగాణ యువత…!

బెట్టింగ్‌ ఉచ్చులో తెలంగాణ యువత 

అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్న వైనం…

 

చేతిలో స్మార్ట్‌ఫోన్ కొన్ని క్లిక్‌లు వెంటనే డబ్బు వస్తుందన్న ఆశ. మొదట చిన్న మొత్తాలతో మొదలయ్యే ఆన్‌లైన్ బెట్టింగ్ క్రమంగా యువతను అప్పుల ఊబిలోకి నెడుతోంది. చివరకు కొందరి ప్రాణాలను బలిగొంటోంది.
రాష్ట్రంలో 2023 నుంచి 2026 ఫిబ్రవరి వరకు ఆన్‌లైన్ బెట్టింగ్, జూదానికి సంబంధించి 1,456 కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి 51 మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. 2024లో మహేశ్వరం ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల విద్యార్థి ఆన్‌లైన్ బెట్టింగ్‌లో సుమారు రూ.4 లక్షలు నష్టపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదే ఏడాది హైదరాబాద్‌లో 27 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భారీ బెట్టింగ్ అప్పులతో ప్రాణాలు తీసుకున్న ఘటన నమోదైంది.
సంగారెడ్డి జిల్లాలో 2024లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అప్పు చేసి బెట్టింగ్‌లో పెట్టుబడి పెట్టాడు. నష్టాలు, అప్పుల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 2023లో వరంగల్ జిల్లాలో 20 ఏళ్ల ఐటీఐ విద్యార్థి సుమారు రూ.46 వేల బెట్టింగ్ నష్టాల తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఘటన నమోదైంది.
ఇది ఇలా ఉంటే 2025లో పరిస్థితి మరింత తీవ్రంగా మారినట్లు పోలీసు గణాంకాలు సూచించాయి. ఒక్క నెలలోనే బెట్టింగ్ నష్టాలతో సంబంధం ఉన్న ఏడు మరణాలు నమోదవగా.. వారిలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బెట్టింగ్ ప్రభావం యువతకే పరిమితం కాలేదు. 2024 డిసెంబర్‌లో సిద్ధిపేట జిల్లాకు చెందిన ఆర్మ్‌డ్ రిజర్వ్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో సుమారు రూ.25 లక్షలు నష్టపోయినట్లు పోలీసులు వెల్లడించారు. అప్పులు తీర్చలేక తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
2025 చివర్లో సంగారెడ్డి జిల్లాలో 18 ఏళ్ల యువకుడు బెట్టింగ్‌లో రూ.లక్ష నష్టపోయిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో మరో 24 ఏళ్ల యువకుడు కూడా బెట్టింగ్ నష్టాల కారణంగా ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
‘ఈజీ మనీ’ ఆశే యువతను బెట్టింగ్ వైపు లాగుతోంది. సోషల్ మీడియా ప్రకటనలు, క్రికెట్ మ్యాచ్‌ల పేరుతో ప్రచారం, రిఫరల్ బోనస్‌లు ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయి. తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పాల్గొంటున్న వారిలో 18–25 ఏళ్ల వయసువారు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు 2025లో ఓ సర్వే వెల్లడించింది.
అక్రమ బెట్టింగ్ యాప్‌లపై పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. 2026 జూన్ నాటికి తెలంగాణలో 414 కేసులు నమోదు చేసి, 108 యాప్‌లను బ్లాక్ చేయించినట్లు సీఐడీ వెల్లడించింది. మరో 37 యాప్‌లను రాష్ట్రంలో జియో-ఫెన్సింగ్ చేసినట్లు తెలిపింది.
అయితే బెట్టింగ్ నష్టం డబ్బుతోనే ఆగడం లేదు. అప్పులు, కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి, నేరాలు.. చివరకు ప్రాణనష్టానికి దారితీస్తున్నాయి. పెరుగుతున్న ఘటనలు ఆన్‌లైన్ బెట్టింగ్‌ను యువత భవిష్యత్తు, కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న సామాజిక సమస్యగా మారుస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు