తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అంశంపై ఏఐసీసీ అధిష్ఠానం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ పార్టీ ముఖ్య నేతలతో వరుసగా చర్చలు జరుపుతున్నారు.
ఈరోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.. కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కానున్నారు. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఆయనతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. దీంతో నేడు జరిగే వరుస భేటీలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇక పీసీసీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ మల్లు రవి ఇప్పటికే ఈ వ్యవహారంపై సిఫార్సులతో కూడిన నివేదికను ఏఐసీసీ అధిష్ఠానానికి పంపినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని అధిష్ఠానానికి సిఫార్సు చేసినట్లు సమాచారం. దీంతో కొండా సురేఖ, చిన్నారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది.









