తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవాలోని బీజేపీ ప్రభుత్వంపై అత్యంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గోయ్ రాఖోన్న్’ (సేవ్ గోవా) యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రమోద్ సావంత్ సర్కారు గోవాను మాఫియా, మాదకద్రవ్యాల కేంద్రంగా మార్చేసిందని నిప్పులు చెరిగారు. సీఎం ప్రమోద్ సావంత్ ప్రజల గురించి కాకుండా కార్పొరేట్లకు భూములను కట్టబెట్టడంలో మునిగిపోయారని, ఆయన ప్రమోద్ సావంత్ కాదని, ‘ప్రాపర్టీ సావంత్’ అని ఎద్దేవా చేశారు. రెండుసార్లు బీజేపీని నమ్మి అధికారమిచ్చిన గోవా ప్రజలు పూర్తిగా మోసపోయారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ అసమర్థ పాలనతో స్థానిక యువత నిరుద్యోగంతో తీవ్ర నిరాశకు గురవుతోందని, ప్రమాదకరమైన మత్తుపదార్థాల బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో పట్టుబడుతున్న డ్రగ్స్ నెట్వర్క్లన్నింటికీ అసలు మూలాలు గోవాలోనే ఉన్నాయని ఆయన సంచలన ఆరోపణ చేశారు. గోవా నుంచే దేశంలోని ప్రధాన మెట్రో నగరాలకు భారీగా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందని, తెలంగాణలో తాము ప్రత్యేక టాస్క్ఫోర్స్లతో నెట్వర్క్లను ఛేదిస్తున్నప్పటికీ గోవా ప్రధాన కేంద్రంగా మారడం ఆందోళన కలిగిస్తోందని వివరించారు.
గోవా అస్తిత్వాన్ని, పర్యావరణాన్ని, స్థానిక సంస్కృతిని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత అందరిపైనా ఉందని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. బీజేపీ పాలకులు స్థానిక ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని దుయ్యబట్టారు. గోవా భవిష్యత్తును, యువత బంగారు భవితవ్యాన్ని పునర్నిర్మించాలంటే ప్రస్తుతం ఉన్న అవినీతి పాలనకు చరమగీతం పాడి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.









