ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలోని ‘స్టార్‌లింక్’ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలపై స్వదేశీ జాగరణ్ మంచ్ (SJM) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటీవల భారత్‌పై ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, దేశంలో స్టార్‌లింక్ ఎంట్రీపై తక్షణమే నిషేధం విధించాలని ఎస్జేఎం జాతీయ కో-కన్వీనర్ అశ్వనీ మహాజన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాణిజ్యపరమైన బ్రాడ్‌బ్యాండ్ సేవల లైసెన్స్ కోసం స్టార్‌లింక్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై అధికారిక వివరణ ఇచ్చేందుకు మస్క్ సంస్థ నిరాకరిస్తోందని ఆయన ఆరోపించారు.
లైసెన్స్ పొందేందుకు స్టార్‌లింక్ సంస్థ ప్రజలను పావులుగా వాడుకుంటూ ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని అశ్వనీ మహాజన్ మండిపడ్డారు. స్టార్‌లింక్ ఉపయోగించే లేజర్ ఆధారిత శాటిలైట్ లింకుల వల్ల దేశీయ డేటా నిబంధనలను బైపాస్ చేసి విదేశీ నియంత్రణలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భద్రతా నిబంధనలు, స్థానిక నిఘా షరతులకు లోబడి మాత్రమే ఏ సంస్థ అయినా సేవలు అందించాల్సి ఉంటుందని, అయితే స్టార్‌లింక్ మాత్రం భారత ప్రభుత్వ మార్గదర్శకాలను అంగీకరించకుండా తమదైన అనధికారిక సాంకేతికతను రుద్దాలని చూస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఉక్రెయిన్, రష్యా, ఇరాన్, చైనా, తైవాన్, బ్రెజిల్, వెనిజులా, సూడాన్ వంటి అనేక దేశాల్లో గతంలో తలెత్తిన సంక్షోభాలు, అనుభవాలను పరిశీలిస్తే స్టార్‌లింక్ సేవలు ఆయా దేశాల భద్రతకు సవాళ్లు విసిరినట్లు స్పష్టమవుతోందని ఎస్జేఎం నేత గుర్తుచేశారు. భారత్ వంటి వ్యూహాత్మక దేశంలో ఇలాంటి అనియంత్రిత శాటిలైట్ వ్యవస్థలకు అనుమతి ఇస్తే రక్షణ రంగానికి, ప్రజల వ్యక్తిగత డేటా భద్రతకు పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత నిబంధనలకు కట్టుబడని సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో అనుమతులు ఇవ్వకూడదని ఆయన కేంద్రాన్ని కోరారు.
Post Views: 4









