ఎన్టీఆర్, హృతిక్ వార్‌కు డేట్ ఫిక్స్.. ఆరోజే ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే..!

గతంలో కంటే ఇప్పుడు తెలుగు హీరోల రేంజ్ భారీ స్థాయిలో పెరిగిపోయింది. అందుకే మన స్టార్లకు తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్ కూడా అంతకంతకూ పెరుగుతూ వెళ్తోంది. ఫలితంగా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసేందుకే బాలీవుడ్ వాళ్లే పోటీ పడుతున్నారు. ఇలా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వంతు వచ్చేసింది.

 

వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్‌లో నేరుగా ‘వార్ 2’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు మరో బడా హీరో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. గతంలో వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన ‘వార్’ మూవీకి ఇది సీక్వెల్‌గా రాబోతుంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానుంది.

 

జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ‘వార్ 2’ మూవీని ‘బ్రహ్మాస్త్ర’ ఫేం అయాన్ ముఖర్జీ తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, ఓ టెస్ట్ షూట్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఆ వెంటనే ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా కొద్ది రోజుల పాటు జరుపుకున్నారు.

 

స్టార్ హీరోల కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘వార్ 2’ మూవీకి సంబంధించిన ప్రధానమైన షూటింగ్ పార్టును మరికొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతున్నారు. అందులో ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లపై కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు. ఇలా ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ క్రేజీ న్యూస్ లీకైంది.

 

హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న ‘వార్ 2’ మూవీని 2025 ఆగస్టు 14వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయినట్లు తాజాగా తెలిసింది. దీనిపై నిర్మాణ సంస్థ నుంచి అధికారిక ప్రకటన కూడా రెడీ అయినట్లు సమాచారం. ఆగస్టు 14 నుంచి లాంగ్ వీకెండ్ ఉండడం.. రెండో వారంలో వినాయక చవితి సహా కొన్ని పండుగ సెలవులు వస్తుండడం వల్లే చిత్ర యూనిట్ ఆ డేట్‌ను ఖరారు చేసుకున్నట్లు తెలిసింది.

 

ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘వార్ 2’ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం కోసం సదరు సంస్థ దాదాపు రూ. 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు కూడా తెలిసింది. ఇందులో తారక్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram