ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల
నిర్వాహకులతో ప్రత్యేక సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్.
భద్రాచలం :13 : టుడే 9 ప్రతినిధి
విద్యార్థినీ విద్యార్థులకు ఆదివాసి గిరిజనుల సాంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు పూర్తిస్థాయిలో అవగాహన కలిగే విధంగా ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగిందని సంబంధిత ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు తప్పనిసరిగా విద్యార్థినీ విద్యార్థులను ప్రత్యేక ప్యాకేజీగా ఎక్స్కర్షన్ తరహాలో మ్యూజియమును సందర్శించేలా చూడాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
గురువారం నాడు తన ఛాంబర్ లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి కొన్ని సూచనలు ఇస్తూ గిరిజన సంస్కృతికి అద్దం పట్టేలా ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియం అన్ని రకాల పాత కాలపు కళాఖండాలు, పెయింటింగ్ చిత్రాలు వాటి చరిత్ర మ్యూజియంలో పొందుపరచడం జరిగిందని, అందుకు పాఠశాలల నిర్వహకులు తప్పనిసరిగా విద్యార్థిని విద్యార్థులు మ్యూజియం సందర్శించేలా వెసులుబాటు చేసుకోవాలని అన్నారు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలో ఎనిమిదో తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు భవిష్యత్తులో వారు అనుకున్న గోల్ సాధించడానికి మా పాఠశాలల్లో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశామని, సంబంధిత శాఖల అధికారులు వీరు ఈ స్థాయికి రావడానికి వారు పడ్డ బాధల గురించి పిల్లలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంతో పిల్లలు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించుకోవడంతో చాలా వరకు సత్ఫలితాలు వచ్చాయని, ఇప్పటికీ ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇటువంటి కెరీర్ గైడెన్స్ క్లాసులు నిర్వహిస్తున్నామని అన్నారు. మా పాఠశాలల్లో కెరీర్ గైడెన్స్ నిర్వహణ వలన సత్ఫలితాలు రావడంతో తెలంగాణ రాష్ట్ర ట్రైబల్ వెల్ఫేర్ సెక్రెటరీ రాష్ట్రంలోని అన్ని ట్రైబల్ ఇన్స్టిట్యూషన్లలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడంతో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారని, అలాగే రాష్ట్రంలోని 750 పి.ఎం.శ్రీ పాఠశాలల్లో కూడా అమలు పరిచారని అన్నారు. అందుకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నిర్వహకులు తప్పనిసరిగా పిల్లల అభిరుచిని బట్టి వారు ఎంచుకునే గోల్ గురించి ఇటువంటి కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు అమలు చేయాలని అందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లల ఫీజుల విషయంలో ఉపాధ్యాయులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కథనాలు బాగా వస్తున్నాయని అలా జరగకుండా చూసుకోవాలని, పిల్లలు క్రమశిక్షణగా మసులుకోకపోతే వారి తల్లిదండ్రులను పిలిపించి వారి ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలని కానీ పిల్లలకు మాత్రం చదువు విషయంలో ఎటువంటి ఇబ్బందులకు గురి చేయవద్దని, ఫీజుల విషయంలో కూడా ఇబ్బందులు పెట్టకూడదని, సెలవు రోజులలో ఎటువంటి క్లాసులు నడవకుండా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డీఈవో నాగలక్ష్మి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ మాధవరావు, ప్రైవేటు పాఠశాలల చైర్మన్ బండి లక్ష్మణ్ వివిధ ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.










