ప్రముఖ పర్యావరణవేత్త, జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడి ఘటన పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. సీఎం ఆదేశాల మేరకు ఆయన ఓఎస్డీ వేముల శ్రీనివాసులు సత్యనారాయణకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం, ఆయనకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేయడంతో, సూర్యాపేట నుంచి ఆయనను నిమ్స్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా రాఘవాపురంలో దుశ్చర్ల సత్యనారాయణ తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల భూమిలో వేలాది మొక్కలు నాటి, చెరువులు తవ్వి ఒక అద్భుతమైన కృత్రిమ అడవిని సృష్టించారు. ఈ ప్రయత్నం ద్వారా ఆ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా, నల్గొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించే సాధన కోసం జలసాధన సమితి ద్వారా ఆయన నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఆయన పర్యావరణ కృషికి గుర్తింపుగా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.
అయితే, ఇటీవల సత్యనారాయణ సృష్టించిన ఈ అడవిలోకి కొంతమంది గొర్రెల కాపరులు అక్రమంగా ప్రవేశించి, చెట్లను నరుకుతూ గొర్రెలను మేపుతున్నారు. ఈ చర్యలను గమనించిన సత్యనారాయణ వారిని వారించి, పర్యావరణాన్ని నాశనం చేయవద్దని కోరారు. దీంతో ఆగ్రహించిన గొర్రెల కాపరులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణపై కర్రలతో పాశవికంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తలకు తీవ్ర గాయాలు కాగా, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆయనను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.









