మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) ముఠాలు ఇప్పుడు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయని, ముఖ్యంగా బీటెక్ చదువుతున్న విద్యార్థులనే వారు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రాఫికింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రైల్వే పోలీసులతో కలిసి విజయవాడ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సమస్యను అరికట్టేందుకు రైల్వే డివిజనల్ అధికారులతో కలిసి చురుకుగా పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు.
ట్రాఫికింగ్ అనేది ఇప్పుడు అనేక కొత్త రూపాల్లో జరుగుతోందని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగ యువతకు గాలం వేస్తున్న కేటుగాళ్లు.. విదేశాల్లో భారీ జీతాలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి వారిని అక్కడికి తరలిస్తున్నారని తెలిపారు. తీరా విదేశాలకు వెళ్లిన తర్వాత ఆ యువతను బలవంతంగా సైబర్ నేరాల ఊబిలోకి దించుతున్నారని, ఇది అత్యంత ప్రమాదకరమైన కొత్త రకం ట్రాఫికింగ్ అని ఆమె వివరించారు. ఉన్నత చదువులు చదివిన యువత ఇలాంటి ముఠాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఇలాంటి నేరాలను అరికట్టేందుకు అధికారులు టెక్నాలజీని కూడా వాడుతున్నారని, రైల్వే స్టేషన్లలో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు విశాఖపట్నంలో రోబోటిక్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు శైలజ వెల్లడించారు. అలాగే, ఈ ముఠాల బారిన పడి రక్షించబడిన బాధితులకు కేవలం ఆశ్రయం కల్పించడమే కాకుండా.. వారు ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడేసేందుకు సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా అందించాల్సిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని, ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చారు.









