అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదురుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు ఇక సమయం మించిపోతోందని, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తున్న దిగ్బంధనం భవిష్యత్తులో మరింత కఠినంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. అమెరికాపై ఒత్తిడి ఉందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేస్తూ, అమెరికా మరియు దాని మిత్రదేశాలకు పూర్తి ప్రయోజనం చేకూర్చే ఒప్పందం జరిగే వరకు తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, ఈ విషయంలో తనకు ఎలాంటి తొందర లేదని తేల్చి చెప్పారు.
ఇరాన్ సైనిక పాటవం ఇప్పటికే పూర్తిగా నాశనమైందని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఆ దేశ నౌకాదళం సముద్రంలో కూరుకుపోయిందని, వైమానిక దళం, రాడార్ వ్యవస్థలు, విమాన నిరోధక ఆయుధాలు దాదాపుగా కనుమరుగయ్యాయని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆ దేశాన్ని సరైన మార్గంలో నడిపించే కీలక నాయకులు కూడా ఇరాన్‌లో కరువయ్యారని ట్రంప్ ఎద్దేవా చేశారు.
మరోవైపు, క్షేత్రస్థాయిలో సైతం అమెరికా తన యుద్ధ నౌకలను హార్ముజ్ జలసంధి సమీపంలో భారీగా మోహరించి యుద్ధ వాతావరణాన్ని పరాకాష్టకు చేర్చింది. జలసంధిలో మందుపాతరలు వేస్తున్న ఇరాన్ చిన్న పడవలను వెంటనే కాల్చివేయాలని ట్రంప్ ఇప్పటికే నావికాదళాన్ని ఆదేశించారు. అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై విధిస్తున్న ఈ కఠిన దిగ్బంధనాల వల్ల, ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.









