“మేము సముద్రపు దొంగల లాంటి వాళ్లం”: ఇరాన్ చమురు స్వాధీనంపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ చమురు రవాణా చేస్తున్న రెండు ఆయిల్ ట్యాంకర్లను అమెరికా నౌకాదళం స్వాధీనం చేసుకోవడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలో జరిగిన ఒక ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, తమ నేవీ వ్యవహరిస్తున్న తీరును ‘సముద్రపు దొంగల’ (Pirates) చర్యతో పోల్చారు. అమెరికా నేవీ ఇరాన్ ఓడలను, వాటిలోని చమురును స్వాధీనం చేసుకోవడం చాలా లాభదాయకమైన వ్యాపారమని, తాము సముద్రపు దొంగల తరహాలోనే ఉన్నప్పటికీ ఈ విషయంలో ఎటువంటి ఆటలు ఆడటం లేదని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా చేపట్టిన ఈ చర్యపై ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. నడి సముద్రంలో ఇరాన్ ట్యాంకర్లను అడ్డుకోవడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, ఇది ఒక రకమైన ‘సాయుధ దోపిడీ’ అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ అభివర్ణించారు. అమెరికా చర్యలు సముద్రపు దొంగతనానికి చట్టబద్ధత కల్పించేలా ఉన్నాయని, ప్రపంచం ఇప్పుడు సముద్రపు దొంగల పునరాగమనాన్ని చూస్తోందని ఆయన ఆరోపించారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో, అమెరికా తన దిగ్బంధనాన్ని మరింత కఠినతరం చేస్తోంది. ఇరాన్ పోర్టులకు వెళ్లే లేదా అక్కడి నుండి వచ్చే నౌకల రాకపోకలను అడ్డుకోవడంలో భాగంగా ఇప్పటివరకు 45 నౌకలను దారి మళ్లించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అమెరికా తన దిగ్బంధనం ఎత్తివేసే వరకు హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ పునరుద్ఘాటించడంతో, ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన మరింత ముదిరింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు