రియాన్ పరాగ్ ఎఫెక్ట్: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఫైనల్ వార్నింగ్!

ఐపీఎల్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అన్ని ఫ్రాంచైజీలను హెచ్చరించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది క్రమశిక్షణతో మెలగాలని, నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. లీగ్ గౌరవాన్ని కాపాడటంలో ఎటువంటి రాజీ లేదని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇటీవల రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఒక మ్యాచ్ సందర్భంగా వేపింగ్ (vaping) చేస్తూ కెమెరాలకు పట్టుబడటంతో బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. నిబంధనల ఉల్లంఘన కింద అతడికి రూ. 25 లక్షల భారీ జరిమానా విధించింది. అలాగే, డగౌట్‌లో మొబైల్ ఫోన్ వాడి పీఎంఓఏ (PMOA) ప్రోటోకాల్‌ను ఉల్లంఘించినందుకు రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమీ భిందర్‌కు రూ. 1 లక్ష జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఫ్రాంచైజీలు తమ జట్టులోని ప్రతి ఒక్కరూ నిర్దేశిత నిబంధనలను పాటించేలా చూడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినమైన చర్యలు ఉంటాయని బీసీసీఐ హెచ్చరించింది. దేశవ్యాప్తంగా వేపింగ్ నిషేధంలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, కేవలం వ్యక్తులపైనే కాకుండా ఫ్రాంచైజీలపైన కూడా బాధ్యత ఉంటుందని స్పష్టం చేసింది. ఈ తాజా హెచ్చరికలతో లీగ్‌లో క్రమశిక్షణను మరింత కఠినతరం చేయాలని బోర్డు భావిస్తోంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు