కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 140 స్థానాలకు గానూ యూడీఎఫ్ ఏకంగా 98 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తూ మేజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసింది. దశాబ్ద కాలంగా కేరళను ఏలుతున్న పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ (LDF) కేవలం 40 స్థానాలకే పరిమితమై గట్టి ఎదురుదెబ్బ తిన్నది. కేరళ ఓటర్లు అధికార వ్యతిరేకతను స్పష్టంగా చూపిస్తూ కాంగ్రెస్ కూటమికి పట్టం కట్టారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం యూడీఎఫ్ విజయానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా తిరువనంతపురంలో ఆయన మలయాళీ డైలాగ్ ‘నీ పో మోనే విజయన్’ (ఇక వెళ్లు విజయన్) అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. పినరయి విజయన్ పొలిటికల్ ఎక్స్‌పైరీ డేట్ ముగిసిందని, ఆయన మూటాముల్లె సర్దుకుని ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని రేవంత్ చేసిన ఘాటు విమర్శలు ఓటర్లను ఆలోచింపజేశాయి.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రేవంత్ రెడ్డి చేసిన ‘సీక్రెట్ డీల్’ ప్రచారం ఎల్‌డీఎఫ్ పునాదులను కదిలించింది. విజయన్ ప్రభుత్వం బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందన్న రేవంత్ వాదన తటస్థ ఓటర్లపై, ముఖ్యంగా యువతపై బలమైన ప్రభావం చూపింది. తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించిన తరహాలోనే కేరళలోనూ అధికార వ్యతిరేకతను ఒడిసిపట్టడంలో రేవంత్ రెడ్డి వ్యూహాలు ఫలించాయని, యూడీఎఫ్ సాధిస్తున్న ఈ భారీ విజయంలో ఆయన ప్రచారం కీలక పాత్ర పోషించిందని విశ్లేషిస్తున్నారు.









