వేధింపులు భరించలేక ఘాతుకం: కొడుకు సాయంతో ప్రియుడిని చంపిన మహిళ!

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చింతల్ అంబేద్కర్‌నగర్‌లో ఒక దారుణ హత్య వెలుగుచూసింది. తనతో పదేళ్లుగా సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు భరించలేక, ఓ మహిళ తన కుమారుడితో కలిసి అతడిని అతి కిరాతకంగా చంపేసింది. మృతదేహాన్ని సంచిలో వేసి తరలిస్తుండగా పోలీసులు పట్టుకోవడంతో ఈ సంఘటన బయటపడింది. నిందితులను అరుణ మరియు ఆమె కుమారుడు సాయిరత్నంగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డి (40) అనే వ్యక్తితో అరుణ గత పదేళ్లుగా సహజీవనం చేస్తోంది. అయితే కొంతకాలంగా శివారెడ్డి.. అరుణను, ఆమె కుమారుడిని శారీరకంగా, మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ వేధింపులు మితిమీరడంతో అతడిని అంతమొందించాలని తల్లీకొడుకులు నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి ఇంట్లో గొడవ జరిగిన సమయంలో, పథకం ప్రకారం మటన్ కొట్టే కత్తితో శివారెడ్డి గొంతు కోసి హత్య చేశారు.

హత్య అనంతరం మృతదేహాన్ని ఒక సంచిలో మూటగట్టి, ఎవరికీ తెలియకుండా బయట పడేసేందుకు తీసుకెళ్తుండగా గస్తీ పోలీసులు వారిని గమనించారు. వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి సంచిని తనిఖీ చేయగా, అందులో రక్తంతో ఉన్న శివారెడ్డి మృతదేహం బయటపడింది. వెంటనే పోలీసులు అరుణ, సాయిరత్నంలను అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు