యువ నటి జాన్వీ కపూర్ వ్యక్తిగత జీవితంపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారాలు చేయడంపై ఆమె టీమ్ తీవ్రంగా స్పందించింది. ఇటీవల ఒక పాడ్‌క్యాస్ట్ ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడిన మాటలను కొన్ని సంస్థలు వక్రీకరించి, ఆమెకు మద్యం అలవాటు ఉందనే అర్థం వచ్చేలా కథనాలు ప్రసారం చేశాయి. ఈ పరిణామంపై నటి ప్రతినిధులు మండిపడుతూ, అసలు విషయం తెలుసుకోకుండా వార్తలు రాయడం తగదని హితవు పలికారు.
వాస్తవానికి, మద్యం వ్యసనంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ‘ఆఫ్ ది రాక్స్’, ‘అమహా’ సంస్థలు నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలోనే జాన్వీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా జీవితంలో ఎదురయ్యే మానసిక ఒడిదుడుకులు, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే, సామాజిక బాధ్యతతో ఆమె చేసిన వ్యాఖ్యలను సందర్భం లేకుండా వాడుకుంటూ, తప్పుదోవ పట్టించేలా వైరల్ చేయడంపై జాన్వీ టీమ్ ఆవేదన వ్యక్తం చేసింది.
సదరు పాడ్‌క్యాస్ట్ నిర్వహించిన సంస్థలు కూడా ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ నోట్ విడుదల చేశాయి. ఆ నోట్‌ను జాన్వీ స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “వాస్తవాలు తెలుసుకోండి.. అవాస్తవాలను ప్రచారం చేయకండి” అంటూ గట్టిగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం ఆమె ఎన్టీఆర్ సరసన ‘దేవర’తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.









