హైదరాబాద్ ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై హైకోర్టు సీరియస్.. నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ, పోలీసులకు ఆదేశం!

హైదరాబాద్ నగరంలోని ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, అస్తవ్యస్తంగా మారిన పార్కింగ్ సమస్యలపై తెలంగాణ హైకోర్టు బుధవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రహదారులు, నడకదారులపై ఉన్న అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫుట్‌పాత్‌లను పునఃనిర్మించాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. సీనియర్ సిటిజన్ సురేందర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, ఈ సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై పూర్తి నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది.

నగరంలో విపరీతంగా పెరిగిన ట్రాఫిక్, సరైన పార్కింగ్ వ్యవస్థ లేకపోవడం వల్ల సాధారణ ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు రోడ్లపై నడిచే పరిస్థితి లేకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫుట్‌పాత్‌లు కేవలం కాలినడకన వెళ్లే పాదచారుల కోసమేనని సుప్రూంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేసింది. రోడ్ల పక్కన చెత్త పేరుకుపోవడం, అనధికారిక షాపులు వెలియడం వల్ల పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, వీటన్నింటినీ వెంటనే క్లియర్ చేసి నగరంలో పాదచారుల రక్షణకు కఠినమైన మార్గదర్శకాలు అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.

గత ఫిబ్రవరిలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికే జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఉమ్మడిగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ లాయర్ కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన హైకోర్టు, ఆక్రమణల తొలగింపు ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని స్పష్టం చేసింది. ఒక ప్రాంతంలో ఆక్రమణలు తొలగించిన తర్వాత అక్కడ మళ్లీ దుకాణాలు లేదా పార్కింగ్ రాకుండా నిరంతరం నిఘా పెట్టాలని, రోడ్లపై అక్రమంగా వాహనాలు నిలిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌కు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు