తెలంగాణలోని కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కనీస వేతన సవరణకై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ఈ పెంపును నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త వేతన విధానం జూన్ నుండి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంలో భాగంగా కార్మికులను నైపుణ్యాల ఆధారంగా అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, మరియు హై స్కిల్డ్ అని నాలుగు వర్గాలుగా విభజించారు. అలాగే రాష్ట్రాన్ని మున్సిపల్ కార్పొరేషన్లు (జోన్-1), మున్సిపాలిటీలు (జోన్-2), మరియు గ్రామీణ ప్రాంతాలు (జోన్-3)గా విభజించి ఈ వేతనాలను అమలు చేయనున్నారు.
ఈ కొత్త సవరణ ప్రకారం జోన్-1 పరిధిలో వివిధ కేటగిరీల కార్మికుల కనీస వేతనాలు భారీగా పెరిగాయి. అన్‌స్కిల్డ్ కార్మికుల వేతనం రూ. 12,750 నుండి రూ. 16,000లకు పెంచగా, సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనం రూ. 13,592 నుండి రూ. 17,000లకు పెరిగింది. అదేవిధంగా స్కిల్డ్ కార్మికుల శాలరీని రూ. 13,772 నుండి రూ. 18,500లకు, హై స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని రూ. 14,607 నుండి ఏకంగా రూ. 20,000లకు పెంచారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైట్ కాలర్ ఉద్యోగాలకు సాంకేతికతతో ముప్పు ఉందేమో కానీ, బ్లూ కాలర్ (శ్రామిక) ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదని, నైపుణ్యం ఉన్న వారికి జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి విదేశాల్లో రూ. 2 లక్షల వరకు వేతనంతో మంచి డిమాండ్ ఉందని, వారి నైపుణ్యాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
మరోవైపు రాజకీయంగా సంచలనం సృష్టించిన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్ట్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. భగీరథ్‌ను పోక్సో కేసులో పోలీసులే వాహన తనిఖీల సమయంలో చట్టప్రకారం అరెస్ట్ చేశారని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని స్పష్టం చేశారు. అప్పా జంక్షన్ వద్ద పోలీసులు అతన్ని పట్టుకుంటే, తానే సరెండర్ చేసినట్లు బండి సంజయ్ ప్రకటించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన బందోబస్తు వల్ల బాధిత బాలిక మేజరా లేక మైనరా అని నిర్ధారించుకోవడానికి పోలీసులకు కొంత సమయం పట్టిందని వివరించారు. ఇదే తరుణంలో కేసు దర్యాప్తులో ఉండగానే బీఆర్‌ఎస్ నేతలు తీర్పులు ఇస్తూ, బాలిక ఫోటోలు, వీడియోలను బయటపెట్టి ఆ కుటుంబానికి తీవ్ర క్షోభ కలిగిస్తున్నారని, కేటీఆర్ అండ్ కో ఆర్గనైజ్డ్ క్రైమ్‌కు పాల్పడుతున్నారని సీఎం తీవ్రంగా మండిపడ్డారు.









